మంత్రివర్గంలోకి పట్నం.. మధ్యాహ్నం రాజ్ భవన్లో ప్రమాణస్వీకారం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. పట్నం మహేందర్ రెడ్డి బుధవారమే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో అది వాయిదా పడింది.
2014లో తాండూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డి అప్పట్లో రవాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. పట్నం ఈసారి తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి పార్టీ మారతారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం ఉండటంతో అసంతృప్తిని చల్లార్చేందుకు కేసీఆర్ పట్నంను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు.