JanaSena Party : మిగిలింది 8 రోజులే.. పవన్ కల్యాణ్ రాకకోసం ఎదురుచూపులు
తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు ఇంకా ఎనిమిది రోజులే మిగిలుండటంతో.. ప్రచారంలో జోరు పెంచారు. ముఖ్య నాయకులంతా నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే.. కార్యకర్తలు, అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసలు ఇప్పటివరకు బరిలోకి దిగనేలేదు. బీజేపీతో పొత్తుపెట్టుకుని, 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్నా.. పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నారు. ఇంకా 8 రోజులే ఉండగా.. ఆయన ఇంకా పర్యటన షెడ్యూల్ విడుదల చేయలేదు. దీంతో జనసేన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
పవన్ క్యాంపెయినింగ్ కోసం జనసేన అభ్యర్థులతో పాటు పొత్తుపెట్టుకున్న మిత్రపక్షం బీజేపీ కూడా ఎదురుచూస్తుంది. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొన్న పవన్.. మళ్లీ ఇప్పటివరకు కనిపించలేదు. ఓ వైపు జాతీయ పార్టీల నాయకులు రెండో విడత ప్రచారం మొదలుపెడుతుంటే.. పవన్ ఇంకా తన షెడ్యూల్ విడుదల చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కూడా జోరు పెంచింది. పార్టీ ముఖ్య నేతలంతా ప్రచారంలో ఉన్నారు. అధిష్టానం నుంచి బగా నేతలంతా షెడ్యూల్ ను ప్రకటించారు. అయితే జనసేన పార్టీ తెలంగాణ ఊసెత్తకపోవడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే.. పవన్ కు అసలు తెలంగాణలో పోటీ చేయడం ఇంట్రెస్ట్ లేదని, ఏపీ రాజకీయ అవసరాలకే తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.