Prajavani: బేగంపేట-పంజాగుట్ట.. ఆర్జీలతో బారులు తీరిన ప్రజలు..

Byline :  Veerendra Prasad
Update: 2023-12-15 04:33 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుండే మహ్మాతా జ్యోతిబాపులే ప్రజా భవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంజాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి రెండు రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక, ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజా వాణికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజా భవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 8న ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రజాదర్బార్‌ పేరును ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 వరకు వచ్చిన వారికే అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో.. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈరోజు శుక్రవారం కావడంతో ఉదయం నుంచే ప్రగతి భవన్ వద్ద ప్రజలు క్యూ కట్టారు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలు అక్కడకు చేరుకుని క్యూ లో నిలబెట్టారు. నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తుండటంతో ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకునేందుకు వస్తున్నారు. దీనికితోడు జిల్లా కేంద్రంలోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమమే పెట్టినా ఎక్కువ మంది రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వస్తుండటం విశేషం. ఎక్కువగా భూ సమస్యలు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం వంటి సమస్యలు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.

Full View

Tags:    

Similar News