అధ్వానంగా రోడ్లు.. గ్రామస్తులు వినూత్న నిరసన

Update: 2023-07-22 11:57 GMT

తెలంగాణలో నాలుగు రోజలుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు సైతం బురదమయం కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లు చిత్తడిగా మారాయి. కనీసం నడవడానికి వీలులేకుండాపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు రోడ్డెక్కారు. తాము పడుతున్న బాధలపై వినూత్న నిరసనలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు.

నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం జంగాల వారి గూడెం వాసులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామ అంతర్గత రోడ్లను మరమ్మతులు చేయకపోవడంపై రోడ్డుపై వరి నాట్లు వేసి తమ నిరసన తెలిపారు. వర్షంలోనూ తడుస్తూ గుంతల రోడ్లపై గ్రామస్తులు వరినాట్లు వేశారు. తమ గ్రామానికి రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ వరకు అందరి దృష్టికి వెళ్లామని, వినతి పత్రాలు కూడా సమర్పించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు దిగామని తెలిపారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Tags:    

Similar News