'తవ్వకాల్లో బయటపడ్డ స్వామి విగ్రహం'.. అంతా బూటకం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-26 03:06 GMT

నాలుగు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో తవ్వకాల్లో వేంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడిందని వార్తలొచ్చాయి. మండల కేంద్రంలోని శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని ఓ వెంచర్ లో జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా విగ్రహం బయటపడిందని స్థానికులకు తెలిసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప గ్రామస్థులంతా అక్కడికి చేరుకుని... వైకుంఠ ఏకాదశి ముందురోజు.. స్వయంగా వేంకటేశ్వర స్వామి దర్శనమిచ్చాడని పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టారు. కలియుగ దైవం వెలిశాడన్న ఈ ప్రచారం పోలీసుల వరకూ చేరడంతో.. అసలు సంగతేంటో చూద్దామని వాళ్లు వచ్చారు. చివరకు వారి అనుమానమే నిజమైంది.

జేసీబీతో భూమి చదును చేయడం, సడెన్‌‌గా విగ్రహం బయటపడడం.. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని, దీని డైరెక్షన్ అంతా భూమి యజమాని కాకి కుమార్‌ అలియాస్‌ గుడ్ల కుమార్‌ అని అసలు నిజాన్ని వెల్లడించారు. విగ్రహం ఎప్పుడు.. ఎక్కడ కొన్నారనే విషయాన్ని రసీదుతో సహా బయటపెట్టారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ సమీపంలో తనకున్న 500 గజాల స్థలంలో తన తల్లి పేరిట అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలనుకున్నాడు కుమార్. ఆ క్రమంలోనే ఈనెల 22న భూమి పూజ నిర్వహించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో జేసీబీతో భూమిని చదును చేస్తుండగా వేంకటేశ్వరస్వామి విగ్రహం బయటపడిందని ప్రచారం జరిగింది. అయితే సాధారణంగా ఇలాంటి విగ్రహాలు లోతుగా తవ్వినప్పుడే బయటపడతాయి. కానీ, పైన తవ్వితేనే ఎలా బయటపడిందని పోలీసులు ఆరా తీశారు. అంతేకాకుండా విగ్రహం కొత్తదిగా ఉండటంతో అనుమానం మరింత బలపడింది. దీంతో దర్యాప్తు చేయగా... కుమార్‌ ఈ విగ్రహాన్ని ఈనెల 19న రాయలసీమలోని ఆళ్లగడ్డలో కొన్నట్లు తెలిసింది. బిల్లులతో సహ జరిగిన నిజాన్ని బయటపెట్టారు పోలీసులు. అయితే కుమార్‌ ఎందుకు ఇలా చేశాడనే విషయం మాత్రం చెప్పట్లేదు.

విగ్రహం బయటపడిందని చెప్పి కుమార్.. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కుమార్‌ వ్యవహరించాడంటూ స్థానిక బీజేపీ నాయకుడు వనంపల్లి శ్రవణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నట్లు సీఐ ముని తెలిపారు.

Tags:    

Similar News