ఎస్సీ వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన

By :  Lenin
Update: 2023-11-11 14:09 GMT

దశాబ్దాలుగా తేలని ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్రమోదీ కీలక ప్రకటన చేశారు. వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని, దీని కోసం త్వరలోనే కమిటీ వేస్తామని తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగ సారథ్యంలో జరిగిన ‘మాదిగ విశ్వరూప సభ’లో మోదీ ప్రసంగించారు. మాదిగల పొరాటానికి తమ మద్దతు విషయంలో తిరుగులేదని, మంద కృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా మొక్కవోని పోరాటం చేస్తున్నారని ప్రధాని ప్రశంసిచారు. వర్గీకరణను అమలు చేయలేకపోయినందుకు అన్ని రాజకీయ పార్టీల తరపున తను క్షమాపణ కోరుతున్నానన్నారు.

‘‘పేదరిక నిర్మూలన మా ప్రభుత్వ మొదటి లక్ష్యం. కాశీ విశ్వనాథుడి ఆశీస్సులతో సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నాం. మాదిగల పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది. నేను మాదిగల బాధలను పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. వారిని ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొంటే.. కేసీఆర్ మాత్రం అందరినీ విస్మరించారు. దళితుడిని సీఎం చేస్తామని మోసం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. దళితబంధు బీఆర్ఎస్ కార్యకర్తల బంధువుగా మారింది. ఆ పథకంలో మాదిగలకు న్యాయం జరగదు’’ అని మోదీ అన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళితలకు ద్రోహం చేశాయని ప్రధాని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతతలు ఆప్ పార్టీతో కలిసి మద్యం కుంభకోణానికి పాల్పిందనన్న మోదీ అవి వాటి శత్రుత్వం ఓ నాటకమని విమర్శించారు. అట్టడుగు వర్గాల సంక్షేమ కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కులవృత్తుల వారికి కోసం ‘విశ్వకర్మ’ పథకం తెచ్చామని, గత తొమ్మిదేళ్లలో 13లక్షల మంది విద్యార్థులకు వెయ్యి కోట్ల స్కాలర్ షిప్‌లు మంజూరు చేశామని చెప్పారు. 

Tags:    

Similar News