Modi Tour: మోడీ టూర్లో మార్పు.. తెలంగాణలో ప్రధాని సభ ఎప్పుడంటే..?
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్లో మార్పు జరిగింది. అక్టోబర్ 2న ఆయన పర్యటన ఉంటుందని నిర్ణయించినా అదికాస్తా ముందుకు జరిగింది. సెప్టెంబర్ 30న ప్రధాని మోడీ తెలంగాణకు రానున్నారు. మహబూబ్నగర్లో బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రధాని మోడీ సభ వద్దకు చేరుకోనున్నారు. మోడీ పాల్గొననున్న మహబూబ్ నగర్ సభతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ సభను ప్రతిష్టత్మకంగా తీసుకున్న బీజేపీ భారీ జన సమీకరణపై దృష్టి పెట్టారు.
ప్రధాని మోడీ టూర్ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. వివిధ జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. రాష్ట్ర నేతలతో సమావేశమై సభల నిర్వాహణ తేదీలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3 మార్గాల్లో బస్సు యాత్రను నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ప్రస్తుతానికి ఆ బస్సు యాత్రలను వాయిదా వేసింది. ఒకట్రెండు రోజుల్లో నియోజకవర్గాల్లో సభల తేదీలను ఫిక్స్ చేసే అవకాశముంది.