ప్రచార జోరు పెంచిన బీజేపీ.. వచ్చేవారం తెలంగాణకు ప్రధాని మోడీ

By :  Kiran
Update: 2023-11-02 10:22 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే సభల్లో ప్రధాని పాల్గొననున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో మోడీ ప్రచారం చేయనున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిన అనంతరం ప్రధాని రాష్ట్రానికి రానుండటం ఇదే తొలిసారి.

మరోవైపు నామినేషన్ల ప్రక్రియ పూర్తైన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మరింత ఉద్ధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు క్యాంపెయినింగ్ లో పాల్గొననున్నారు. ఈ నెల 19 తర్వాత ప్రధాని మోడీ మరోసారి ఎన్నికల ప్రచారానికి వస్తారని సమాచారం.

ఇవాల్టి నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈ రోజు వారంతా హైదరాబాద్ చేరుకోనున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, గోవాకు చెందిన దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు క్యాంపెయినింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు ప్రచారం కోసం బీజేపీ హైకమాండ్ రాష్ట్రానికి మూడు హెలికాప్టర్లు సమకూర్చింది. అందులో ఒకటి పూర్తిగా బండి సంజయ్ కు కేటాయించగా.. మరో రెండు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ తో పాటు ఇతర ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News