తెలంగాణకు మరో వందే భారత్ రైలు రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ , సికింద్రాబాద్-తిరుపతి రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈ ట్రైన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతే కాదు ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ఈ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు తెలంగాణలో అందుబాటులో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో రద్దీ పెరుగుతుండటంతో హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణికుల డిమాండ్ మేరకు మరో వందే భారత్ ట్రైన్‌ను రైల్వేశాఖ ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా తెలంగాణలో కొత్తగా కాచిగూడ-యశ్వంత్‌పూర్ వయా బెంగళూరు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకారానుంది.
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ఈ వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరగే ఈ ప్రోగ్రామ్‌లో సెంట్రల్ మినిస్టర్ , బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొంటారు. ఈ రైలు కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం రైల్వేస్టేషన్ల మీదుగా యశ్వంత్‌పూర్ వరకు ప్రయాణిస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ , బెంగళూరు మధ్య ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయి. నిత్యం ఐటీ ఎంప్లాయిస్‌తో పాటు బిజినెస్ అవసరాల కోసం ఎక్కువమంది ప్రజలు ఈ మార్గంలో ప్రయాణం చేస్తుంటారు. వీరికి ఈ కొత్త రైలు ఎంతగానో ఉపయోగపడనుంది.