రాష్ట్రంలో ప్రజాపాలనకు గ్యారంటీ లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

By :  Bharath
Update: 2024-02-14 11:06 GMT

బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం (ఫిబ్రవరి 13) రాత్రి జన్వాడలో దళితులు దాడికి గురైన సంగతి తెలిసిందే. వారిని పరామర్శించడానికి వెళ్తుండగా.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆర్ఎస్పీ అరెస్ట్ పై బీఎస్పీ శ్రేణులు భగ్గుమన్నారు. నిందితులను అరెస్ట్ చేయకుండా.. పరామర్శించడానికి వెళ్తున్న ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేయడం ఏంటని.. కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్.. దళితులపై డాడి చేసిన మూకలను పట్టుకోకుండా.. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణలో దళితులకు రక్షణ లేదని మండిపడ్డారు. కేసీఆర్ రాచరిక పాలనను అంతం చేసి.. కాంగ్రెస్ కు ప్రజలు అధికారం ఇస్తే.. వీళ్లు కూడా అలానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో కలిసిపోయి దళితులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రవీణ్ కుమార్.. ‘‘నిన్న రాత్రి జనవాడలో చర్చిపై, దళితులపై ఆరెస్సెస్(RSS) మూకలు జరిపిన దాడిలో ఇంతవరకు ఒక్క నిందితుడు కూడా అరెస్టు కాలేదు. బాధితులు ఇంకా హాస్పిటల్లోనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామంలో భయాందోళనలు నెలకొని ఉన్నయి. ఇదేనా మీ గ్యారంటీల పాలన. శాంతి భద్రతలకు గ్యారంటీ ఎక్కడున్నదీ ఈ రాష్ట్రంలో? హాస్టల్లలో పిల్లల ప్రాణాలకు గ్యారంటీ లేదు? మైనారిటీల బతుకులకు గ్యారంటీ లేదు! రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కులకు గ్యారంటీ లేదు!!! ఇందుకేనా తెలంగాణ ప్రజలు మిమ్ముల గద్దె నెక్కించింది???’’ చెప్పుకొచ్చారు.



Tags:    

Similar News