Telangana Election Code: ఎన్నికల వేళ తనిఖీలు.. రూ.130 కోట్లు దాటినయ్

By :  Lenin
Update: 2023-10-18 02:23 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బు, బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, ఆభరణాలు, కానుకలు, మాదక ద్రవ్యాల విలువ మొత్తం రూ.130 కోట్ల మార్కును దాటింది. వీటి విలువ అక్షరాలా.. రూ.130 కోట్ల 26 లక్షల 91 వేల 531గా అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్​ విడుదలైనప్పటి నుంచి ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలనూ పోలీసులు ఉపేక్షించడం లేదు. కార్లను మొదలుకొని ఆర్టీసీ బస్సులు, బైకులు ఇలా ఏ వాహనాన్నీ వదలకుండా చెక్​ చేస్తున్నారు. రూ.50 వేలకు మించి నగదు పట్టుబడితే సరైన పత్రాలు లేనిదే వదలడం లేదు. ఇలా ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, మద్యం, వివిధ కానుకలు పట్టుకుని సీజ్​ చేశారు. ఇప్పటి వరకు తనిఖీలో రూ.130.26కోట్ల విలువైన సొత్తును సీజ్‌ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. రూ.130.26కోట్ల విలువైన నగదు, ఆభరణాలు, మద్యం, డ్రగ్స్‌ సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ ఉదయం వరకు(సోమవారం ఒక్కరోజే) రూ.21 కోట్ల 84 లక్షల 92 వేల 242 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ వద్ద జరిపిన తనిఖీల్లో పత్రాలు లేని రెండుకిలోల బంగారు ఆభరణాలను సీజ్‌ చేశారు పోలీసులు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.71,55,58,094 డబ్బు, 52,091 లీటర్ల మద్యం, 1,280 కిలోల నల్లబెల్లం, 530 కిలోల ఆలం స్వాధీనం చేసుకోగా... వాటి విలువ మొత్తం రూ.7,55,79,917.రూ.4,58,4,720 విలువైన 1,694 కేజీల గంజాయి పట్టుబడింది. ఇప్పటివరకు 72 కిలోలకు పైగా బంగారం, 420కిలోలకు పైగా వెండి, 42 క్యారెట్ల వజ్రాలు స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ మొత్తం రూ.40,08,44,300లుగా ఉంది. స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, వాహనాలు, కుక్కర్లు, చీరలు, క్రీడా సామగ్రి మొదలైన కానుకల విలువ రూ.6 కోట్ల 29 లక్షల 4 వేల 500లుగా ఉందని అధికారులు వెల్లడించారు.



Tags:    

Similar News