బీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తన అనుచరులతో సమావేశమయ్యారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన సెంటర్‌లో వారితో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల వరకు దాదాపు 200 మంది పాల్గొంటున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పొంగులేటి కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెలాఖరున భారీ బహిరంగ సభ నిర్వహించి ఆయన హస్తం పార్టీలో చేరనున్నట్లు రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
ప్రజల మధ్యే ఉంటూ..
బీఆర్‌ఎస్‌పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధిక్కారస్వరం వినిపించినప్పటి నుంచి ఆయన పార్టీ మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. నెలలు గడుస్తున్నా ఆయన మాత్రం ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ప్రజల మధ్యే ఉండేందుకు ప్రాధాన్యమిచ్చిన ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మరోవైపు ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తన టీంను ఆయన వద్దకు పంపగా బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ స్వయంగా పొంగులేటి ఇంటికి వెళ్లి పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. రోజులు గడుస్తున్నా ఆ రెండు పార్టీల ప్రతిపాదనలపై పొంగులేటి మాత్రం పెదవి విప్పలేదు. ఇదే క్రమంలో ఆయన సొంత కుంపటి పెడతారాన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈటలకు రివర్స్ కౌన్సిలింగ్
అధికారపార్టీ అరాచకాలను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పోరాడదామని అందుకోసం బీజేపీలో చేరాలని ఈటల రాజేందర్ పొంగులేటిని కోరారు. బీజేపీలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని.. కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈటల వేసిన ఎత్తులేమీ అక్కడ పని చేయలేదు. ఖమ్మంలో ఏ మాత్రం బలంగా లేని బీజేపీలోకి వెళ్లేందుకు పొంగులేటి సిద్ధంగా లేరని స్వయంగా ఈటలనే వెల్లడించారు. పార్టీ మారాలంటూ తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చారంటూ వాపోయారు. దీంతో పొంగులేటి బీజేపీలోకి చేరడంలేదన్న విషయంలో క్లారిటీ వచ్చింది.
కాంగ్రెస్ గూటికి
మరోవైపు అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం పొంగులేటి తన రాజకీయ అడుగులపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోని అనుచరుల సూచన మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ్టి కీలక భేటీలో మరోసారి తన అనుచరులతో చర్చించి కాంగ్రెస్ లో చేరికపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఖమ్మం లేదా కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి పొంగులేటి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. తన అనుచరులకు 8 మందికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో స్థానిక పరిస్థితులు, ఇతర అంశాలనూ బేరీజు వేసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెలాఖరున నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన శుక్రవారం క్లారిటీ ఇచ్చే అవకాశముంది.