Ponguleti Srinivasa Reddy: తడుముకోకుండా అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట: పొంగులేటి

By :  Bharath
Update: 2023-10-30 06:36 GMT

అధికార పార్టీ బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ప్రజలకు అబద్దాలు చెప్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడించి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేయాలని ప్రజలను ఆయన కోరారు. తెలంగాణతో గాంధీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉందని, వాళ్లతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పుకొచ్చారు. సోమవారం నేలకొండపల్లి మండలం ఆరేగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొంగులేటి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

రానున్న ఎన్నికల్లో ప్రజల దీవెనలు కావాలని కోరారు. సీఎం కేసీఆర్ పదేళ్లుగా తుపాకి రాముడు కథలు చెప్పి భారీగా ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. పదేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బుల సంచులతో వస్తారు. ఎంత అడిగితే అంత ఇస్తారు. ప్రజలు ట్యాక్స్ లు కట్టి ప్రభుత్వానికి ఇస్తే.. వాటిని కొల్లగొట్టి మళ్లీ మన దగ్గరకే తీసుకువస్తున్నారని విమర్శించారు. తడుముకోకుండా అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట. ప్రజల గోడును పట్టించుకోని కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేయాలని పొంగులేటి తీవ్ర విమర్శలు చేశారు.

Tags:    

Similar News