ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. పేరు చెప్పకపోయినా త్వరలోనే ఓ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మంలోని 10 నియోజకవర్గాలకు చెందిన అనుచరులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు నెలలుగా నెలకొన్న సస్పెన్స్ కు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తెరదించుతానని ప్రకటించారు.
కేసీఆర్ మోసం
తండ్రిలా భావించిన కేసీఆర్ మోసం చేశారని పొంగులేటి ఫైర్ అయ్యారు. యుద్ధం ప్రకటించి 5 నెలలు అవుతోందని, నేనొక్కడినే యుద్ధం చేస్తే గెలవలేం. అందరం కలిసికట్టుగా యుద్ధం చేయాలి’’ అని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, ప్రజలే తన బలమన్న ఆయన.. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. తనను అభిమానించే లక్షలాది మంది కార్యకర్తల అభిప్రాయాల మేరకు మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి నిర్ణయం ప్రకటిస్తానని పొంగులేటి స్పష్టం చేశారు.
వడ్డీతో సహా చెల్లిస్తా
తన టార్గెట్ బీఆర్‌ఎస్ అని వడ్డీతో సహా చెల్లిస్తానని పొంగలేటి తేల్చి చెప్పారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని అన్నారు. తనపై విమర్శలు చేసేవారికి రాజకీయ సమాధి తప్పదన్న ఆయన.. ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాద్ నిర్వహించే ప్రెస్‌మీట్‌లో బహిరంగ సభ తేదీ, వేదిక, విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు. తాను నేను చేరబోయే పార్టీ అతిరథ మహారథులు సభకు వస్తారని పొంగులేటి స్పష్టం చేశారు.
అనుచరులతో భేటీ
శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్యనేతలతో ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌లో చేరాలని నేతలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం. మెజార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెలాఖరులో ఆయన ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.