సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ పరిస్థితి ఎట్లా ఉండేదో ఆలోచించుకోవాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎంతో మంది ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్ దొంగ దీక్ష వల్లే రాలేదని చెప్పారు. తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే మేలు జరిగిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తమకు మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నట్లు పొంగులేటి చెప్పారు. ఆచరణ సాధ్యం అయ్యే హామీలను మాత్రమే కాంగ్రెస్ ఇస్తుందన్నారు. అధికారంలోకి రాగానే నాలుగు వేల పింఛన్ ఇస్తామని చెప్పారు. తనపై నమ్మకంతో ప్రచార కమిటీ కో చైర్మన్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అధిష్టానం ఏ ఆలోచనతో తనకు బాధ్యతలు అప్పగించిందో..దానికి అనుగుణంగా పనిచేసి పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని భావించిన ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పధకాలను ప్రవేశపెట్టడం తప్ప అమలు చేసింది లేదని విమర్శించారు. కాంగ్రెస్ పనితీరుతో బీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందన్నారు.