పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు అంతా సిద్ధమైంది. ఇవాళ రాహుల్ గాంధీతో ఆయన సమావేశం అవుతారు. ఆదివారం రాత్రి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలతో ఆయన ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్‌తో జరిగే ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు.
జూలై 2 లేదా 3 తేదీల్లో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాహుల్ వస్తున్న ఈ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనతోపాటు ముఖ్యమైన నేతలు, తన అనుచరులంతా చేరతారని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది తెలంగాణ బిడ్డలు కోరుకున్న ప్రభుత్వం కాదని.. బీఆర్‌ఎస్ సర్కారును కలిసికట్టుగా గద్దె దింపుతామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండైన తర్వాత పొంగులేటి, జూపల్లి ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఉత్కంఠ కొనసాగింది. తొలుత వారు బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఒక దశలో పొంగులేటి సొంతంగా పార్టీ పెడతారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జోరు పెంచిన కాంగ్రెస్ పొంగులేటితో పాటు జూపల్లిని తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యింది.