Ponnam, Ponguleti : మాపై అసత్య ప్రచారం చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
1.05 కోట్ల అభయహస్తం హామీల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతీ గ్రామానికి, తండాకు అధికారులు వెళ్లి ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారని, అందరి దగ్గరనుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పుకొచ్చారు. ప్రజాపాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి.. ఇతర అంశాలకు సంబంధించి మరో 20 లక్షల దరఖాస్తులు అందాయని అన్నారు.
అతి తక్కువ సమయంలో విజయవంతంగా 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలను మిగిలిన 40 రోజుల్లో నెరవేరుస్తారని విమర్శిస్తున్నారని, తాము ఏనాడు 40 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పలేదని పొంగులేటి స్పష్టం చేశారు. ఎన్నికల వేళ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని, యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతోందని వివరించారు. ఈ నెల 30 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. నిజమైన లబ్ధిదారులకు అభయహస్తం పథకాలు తప్పక అందిస్తామని చెప్పారు. పథకాలు అమలు కాలేదని నెల రోజులకే అసత్య ప్రచారం చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుచేసినట్లు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా భట్టి విక్రమార్కను, కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటిలను నియమించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. రేషన్ కార్డులకు సంబంధించి త్వరలో స్పష్టత ఇస్తామని పొన్నం చెప్పారు.