Praja Bhavan : ప్రజా భవన్లో డిప్యూటీ సీఎం భట్టి నివాసం
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రజా భవన్‌ను కేటాయించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆ భవనాన్ని ఆయన ప్రైవేట్ సెక్రటరీకి అప్పగించాలని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక నుంచి ప్రజా భవన్ డిప్యూటీ సీఎం నివాసంగా కొనసాగునున్నది. కాగా గత ప్రభుత్వ హయాంలో ప్రగతి భవన్ గా ఉన్న ఈ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 'మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్'గా మార్చింది. అలాగే ప్రజా భవన్ ముందు ఏర్పాటు చేసిన కంచెలను తొలగించి సామాన్య జనానికి లోపలికి అనుమతినిచ్చారు. ప్రజా వాణి పేరుతో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వారిని ప్రజా భవన్ లోకి అనుమతినిచ్చారు. తాజాగా ఈ భవనాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంగా మార్చారు. కాగా రేపు ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు.