Prajapalana: ర్యాపిడో బైకుపై ప్రజాపాలన దరఖాస్తులు.. మండిపడుతున్న ప్రజలు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-09 02:54 GMT

కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తులు రోడ్డుపై గాల్లో ఎగురుతూ దర్శనమిచ్చాయి. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. ప్రభుత్వ అధికారుల చేతుల్లో ఉండాల్సిన దరఖాస్తులు ఇలా రోడ్లపై పడిఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రైవేట్ ఏజెన్సీకి 'ప్రజాపాలన'

రాష్ట్రవ్యాప్తంగా గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకు కాంగ్రెస్‌ సర్కారు ఆరు గ్యారెంటీల కోసం కోట్లాది మంది నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో గంటల తరబడి క్యూలో నిలబడి.. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి తమ వివరాలతో అధికారులకు దరఖాస్తులు సమర్పించారు. అయితే తమ భవిష్యత్తును మార్చబోయే దరఖాస్తులు... బాలానగర్‌ ఫ్లై ఓవర్ పై చిందరవందరగా పడి ఉండడం చూసి అక్కడున్న వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పిన అధికారి తీరుపై కన్నెర్రజేశారు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌ కూకట్‌పల్లి వై జంక్షన్‌ వైపు నుంచి వస్తున్న ఓ బైక్‌ (ఏపీ 39 హెచ్‌హెచ్‌ 6455)పై నుంచి ప్రజాపాలన దరఖాస్తులు ఎగిరి.. బాలానగర్‌ వంతెనపై చిందరవందరగా పడ్డాయి. దీంతో ఆ వాహనదారుడు తన బైక్‌ను పక్కకు నిలిపి కిందపడిన దరఖాస్తులను తీసుకుంటుండగా స్థానికులు గమనించారు. ఎవరో ర్యాపిడోలో బుక్‌ చేస్తే.. తాను తీసుకొని వెళ్తుండగా అట్టపెట్టె చిరిగి దరఖాస్తులు రోడ్డుపై పడ్డాయని ఆ వ్యక్తి వివరించాడు. ఇతర వివరాలు తెలియదని చెప్పాడు. అట్టపెట్టెలో 500కు పైగా దరఖాస్తులు ఉండగా.. వాటిపై హయత్‌నగర్‌ సర్కిల్‌ పేరు రాసి ఉంది. ఆరా తీస్తే.. కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను సదరు అధికారి.. ప్రైవేటు ఏజెన్సీల తో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు తెలిసింది. ఈ మేరకు కనీసం తానుగానీ, తన సిబ్బందితో గానీ ఆ ఫారాలను పంపకుండా.. ర్యాపిడో బుక్‌ చేసి మరీ తరలిస్తున్నట్టు తేలింది.

Tags:    

Similar News