తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్కు ఓ విజన్ ఉంది: ప్రియాంక గాంధీ
పోడుపట్టాల పేరుతో కేసీఆర్ ఆదివాసీలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లోని ఖానాపూర్ లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ప్రియాంక.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని ఆమె గుర్తుచేశారు. ఆమె చనిపోయి 40 ఏళ్లూనా ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో కాంగ్రెస్ కు ఓ విజన్ ఉందన్నారు. ఆదివాసీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బీజేపీ ప్రశ్నించదని విమర్శించారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ చాలా స్కామ్ లు చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు రుణమాఫీ చేస్తుందే తప్ప.. రైతుల గురించి పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, విపక్షాలే టార్గెట్ గా సీబీఐ, ఈడీ దాడులు జరిపిస్తున్నారని మోదీపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల్లో చాలాచోట్ల పోటీ చేసే ఎంఐఎం.. తెలంగాణలో 9 చోట్ల మాత్రమే ఎందుకు పోటీకి దిగుతుందని ప్రశ్నించారు.