Telangana Congress: ఇవాళ ప్రియాంక, రేపు రాహుల్.. పక్కా ప్లాన్తో కాంగ్రెస్ సభలు
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ ప్రచారజోరు పెంచింది. సీనియర్ నేతలు నియోజకవర్గాల్లో విస్త్రుత ప్రచారం చేస్తు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో నేడు పాలమూరు జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిమ్మాయిపల్లి తండాకు చేరుకుని.. అక్కడి మహిళలకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి వివరణ ఇస్తారు. ఆ తర్వాత సాయంత్ర 5 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఏర్పాటుచేసిన ప్రజాభేరి సభకు హాజరవుతారు. కాగా రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. కల్వకుర్తి, జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో షాద్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి చౌరస్తా వరకు పాదయాత్ర చేయనున్నారు రాహుల్. పాదయాత్ర అనంతరం ప్రజాభేరి సభలో పాల్గొంటారు.
కాగా, తాజాగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న విజయభేరి బస్సు యాత్ర వాయిదా పడిన విషయం తెలిసిందే. అక్టోబర్ 30న భువనగిరి పార్లమెంటు పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల యాత్ర వాయిదా పడింది. ఈ విషయాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే యాత్రలో పాల్గొనాల్సిన ముఖ్య అతిధి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కాకపోవడంతోనే బస్సు యాత్ర వాయిదా పడినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31న నల్గొండ పార్లమెంట్సెగ్మెంట్లోని నాగార్జునసాగర్, నాగర్ కర్నూల్ సెగ్మెంట్లోని కొల్లాపూర్‌లో బస్సు యాత్రలో పాల్గొనాల్సి ఉంది. ఇక నవంబర్ 1న రాహుల్ గాంధీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లోని కల్వకుర్తి, మహబూబ్నగర్ సెగ్మెంట్లోని జడ్చర్ల, షాద్ నగర్, నవంబర్ 2న మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో నిర్వహించే బస్సు యాత్రల్లో పాల్గొంటారని కాంగ్రెస్ ప్రకటించింది. తాజాగా ఈ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే అనివార్య కారణాల వల్ల యాత్ర వాయిదా పడిందని చెబుతున్నా దాని వెనుక కారణం వేరే ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టికెట్ రాని అసంతృప్త నేతలు అసమ్మతి గళం వినిపిస్తుండటం, రాజీనామాలు చేస్తుండటం, మరికొందరు వేరే పార్టీల్లో చేరుతుండటంతో వారిని బుజ్జగించిన తర్వాతే యాత్ర మొదలు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.