పేపర్‌లెస్ సిస్టమ్.. రికార్డుల డిజిటలైజేషన్.. ఇకపై అంత కొత్తగానే..
తెలంగాణ కోర్టుల్లో వీలైనంత త్వరలో పేపర్‌లెస్ విధానం అమల్లోకి రానుంది. అంతే కాదు.. పిటిషన్లు కూడా ఫిజికల్ రూపంలో కాకుండా ఈ-ఫైలింగ్ ద్వారా అప్లై చేసే విధానాన్ని వీలైనంత తొందర్లోనే అమల్లోకి తీసుకొస్తామని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే చెప్పారు. మంగళవారం హైకోర్టులో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. తాను చీఫ్ జస్టిస్‌గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కేసుల పరిష్కార రేటు పెరిగిందని తెలిపారు. పెండింగ్ కేసుల భారం నెమ్మదిగా తగ్గుతోందని చెప్పారు. న్యాయవ్యవస్థ పనితీరును పెండింగ్ కేసుల ఆధారంగా అంచనా వేసే అవకాశం ఉన్నందున, తోటి న్యాయమూర్తులు, న్యాయవాదుల సహకారంతో ఈ భారం తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
అందులో భాగంగానే.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మాత్రమే కాక పర్యావరణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఇకపైన కోర్టుల్లో పేపర్‌లెస్ విధానాన్ని అమలుచేయనున్నట్లు తెలిపారు. రికార్డుల డిజటైలేజషన్ ప్రక్రియకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇప్పటికే పలు కేసులకు సంబంధించి ఫిజికల్‌గా ఉన్న డాక్యుమెంట్లను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 8 కోట్ల పేజీలను డిజిటలైజ్ చేశామని వివరించారు.
హైకోర్టులో మొదటి కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందజేస్తున్నామని తెలిపారు. మిగిలిన అన్ని కోర్టుల్లోనూ ఈ సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కేసుల విచారణను సైతం వీలైనంతవరకు ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొన్ని బెంచీలలో ఇది జరుగుతూ ఉన్నదని, న్యాయవాదులు కూడా ఆన్‌లైన్ ద్వారానే వాదించేందుకు తగిన మౌలిక సౌకర్యాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కోర్టు భవనాల నిర్మాణానికి ‘న్యాయ నిర్మాణ్ డాక్యుమెంట్’ను రూపొందించామని తెలిపారు. జిల్లా కోర్టుల నిర్మాణాలు ఏకరీతిగా ఉండటంతోపాటు అన్ని చోట్లా ఒకేలాంటి అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.