రేవంత్ సర్కారులో కోదండరామ్కు కీలక పదవి..?

By :  Kiran
Update: 2023-12-08 05:12 GMT

రాష్ట్రంలో రేవంత్ సర్కారు కొలువుదీరింది. తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కొత్త సీఎం.. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే వారి ఎంపికలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఇంటలిజెన్స్ చీఫ్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నియమకం పూర్తైంది. ఈ క్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కు కీలక పదవి కట్టబెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సీఎం రేవంత్ రెడ్డి తన టీంను సిద్దం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా.. టీజేఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు నుంచే కోదండరామ్‌తో రేవంత్‌ రెడ్డి పలుమార్లు భేటీ అయ్యారు. కోదండరామ్‌ కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం వద్ద జరిగిన సంబురాల్లో పాల్గొన్న కోదండరామ్.. బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పని చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. రేవంత్‌ రెడ్డి కూడా కొంత మంది మేధావులను పరిగణనలోకి తీసుకుని, కీలక పాత్రలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోదండరామ్‌కు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి ఇవ్వనున్నారని సమాచారం.




Tags:    

Similar News