Puvvada Ajay Kumar: కేసీఆర్ విమర్శించే స్థాయి లేదు.. తుమ్మలపై మంత్రి పువ్వాడ ఫైర్
ఖమ్మం జిల్లా రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరిన తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. కేసీఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించినట్లు తుమ్మల చెప్పడంపై ఆ పార్టీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. తాజాగా తుమ్మల వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. తుమ్మల కన్నా ఊసరవెల్లి నయం అని మండిపడ్డారు.
తుమ్మల నాగేశ్వర రావు గత 3 ఎన్నికల్లో 3 గుర్తులపై పోటీ చేసిన విషయాన్ని పువ్వాడ గుర్తు చేశారు. పోటీ చేసిన ప్రతిసారీ ఓడిపోయిన తుమ్మల.. వందల ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి తుమ్మలకు లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణవాదులను జైల్లో పెట్టించిన చరిత్ర తుమ్మల సొంతమని పువ్వాడ విమర్శించారు.
మరోవైపు తుమ్మల వ్యాఖ్యలపై పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి సైతం ఘాటుగా స్పందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చినట్లు రుజువు చేసినా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.