PV Narasimha rao : తెలంగాణ పల్లెలో పుట్టి.. నవ భారతావనిని ముందుకు నడిపి..

Byline :  Kiran
Update: 2024-02-09 08:20 GMT

దేశ రాజకీయ చరిత్రలో మేరునగధీరుడు.. తెలంగాణ పల్లెలో పుట్టి.. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన రాజకీయ దురంధరుడు. సరళీకృత ఆర్థిక సంస్కరణకు ఆద్యుడిగా.. దేశ ప్రగతికి బాటలు వేసిన దార్శనికుడు.. బహుభాషాకోవిదుడు. స్థితప్రజ్ఞతతో భారతావని ఏలిన తొలి తెలుగు తేజం పీవీ నరసింహా రావు. నవభారత నిర్మాణానికి రూపకల్పన చేసిన పీవీ మన ఠీవి. ఇంత చేసినా ఆయనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదన్న వాదనలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తింపుగా పీవీ నరసింహారావుకు భారత రత్న ప్రకటించింది.

బాల్యం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వేగుచుక్కగా మహోత్తర శక్తిగా భారతావని ఎదగడానికి నిరంతర సంస్కరణలతో జీవం పోసిన వ్యక్తి పీవీ నరసింహారావు. 1921 జూన్ 28న వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు జన్మించారు. తర్వాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన రంగారావు రుక్మిణమ్మ దంపతులు దత్తత తీసుకోవడంతో ఆయన ఇంటి పేరు పాములపర్తిగా మారింది. విద్యార్థి దశ నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. 1938లో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. అందుకు శిక్షగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల అనుయాయుడిగా స్వాతంత్ర్యోద్యమంలో, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నారు.

రాజకీయ ప్రస్థానం

పీవీ నరసింహారావు 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. 1957లో మంథని నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1962లో తొలిసారి రాష్ట్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగా, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ, 1968-71 మధ్య న్యాయ, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రిని మార్చాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తెలంగాణ ప్రజల, ఉద్యమ నేతల సెంటిమెంట్లను దృష్టిలో పెట్టుకుని వివాదరహితుడిగా పేరున్న పీవీని సీఎంగా ఎంపిక చేసింది. అలా ఆయన 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి ఏపీ సీఎంగా

పీవీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే పార్టీలో అసమ్మతి రేగింది. అదే సమయంలో ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర కోసం జై ఆంధ్ర ఉద్యమం లేవనెత్తారు. పీవీ తెలంగాణ నాయకుల పక్షపాతి అని ఆరోపించారు. జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రుల్లో చాలామంది రాజీనామా చేయడంతో పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచింది. రాష్ట్రపతి పాలనను విధించింది. 1972లో పీవీ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూసంస్కరణలను అమలుకు చర్యలు తీసుకున్నారు.

కేంద్ర రాజకీయాల్లోకి

1977లో హనుమకొండ స్థానం పీవీ తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి అక్కడి నుంచే లోక్ సభలో అడుగుపెట్టారు. మూడోసారి మహారాష్ట్రలోని రాంటెక్ నుండి ఎన్నికయ్యారు. తొమ్మిదో లోక్‌సభకు మళ్లీ రాంటెక్ నుంచే ఎన్నికయ్యారు. 1980-1984 మధ్య విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1984లో హోంశాఖ, డిఫెన్స్, 1985లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.

తొలి తెలుగు ప్రధాని

1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్న ఆయన దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్యతో కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండాపోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కనిపించారు. దాదాపు వానప్రస్థం నుండి తిరిగివచ్చిన పీవీ.. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల లోకసభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి పీవీ లోక్సభలో అడుగుపెట్టారు. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితిలో కూడా తన రాజకీయ చాణక్యం, అపార అనుభవంతో ఐదేండ్లు సుస్థిర పాలన అందించారు. నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా బయటి వ్యక్తి ఐదేళ్లు ప్రధానిగా ఉన్న ఘనత పీవీకే దక్కింది. అందుకే ఆయనను భారత రాజకియాల్లో అపర చాణక్యుడని అంటారు.

సంస్కరణలకు ఆద్యుడు..

పీవీ అధికారం చేపట్టే నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి, పేదరికం పెరిగిపోయింది. అంతా శూన్యం, దేశాన్ని ఎలా ముందుకు నడపాలో దిక్కుతోచని పరిస్థితి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన పీవీ తనదైన ఆలోచనలతో దేశాన్ని ముందుకు నడిపారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దశా-దిశా చూపి తన సత్తా ఏంటో నిరూపించారు. దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టారు ప్రజల్లో ఆర్థిక భద్రత, ఒక నమ్మకం కల్పించడంలో పీవీ చేసిన కృషి అసామాన్యం. అందుకే ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కీర్తి గడించారు.

సాహిత్యం

బహుభాషా కోవిదుడైన పీవీ నరసింహారావు విశ్వనాథ సత్యనారాయణ రచించిన "వేయిపడగలు"ను సహస్ర ఫణ్ పేరుతో హిందీలో అనువదించారు. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఇన్‌సైడర్ ఆయన ఆత్మకథ. పీవీ తెలుగుతో సహా 17 భాషలలో ధారాళంగా మాట్లాడేవారు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ బాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రోను అబ్బురపరిచారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో కీలక పదవులు చేపట్టి, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని గాడిన పెట్టిన పీవి నరసింహరావు 2004 డిసెంబర్ 23న కన్నుమూశారు. 

Tags:    

Similar News