Hyderabad : పీవీ ఘాట్‌ వద్ద సీఎం రేవంత్‌ నివాళి

Byline :  Veerendra Prasad
Update: 2023-12-23 07:37 GMT

భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొనియాడారు. పరిపాలనలో మార్పులు తెచ్చి ఎంతో మందికి ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పీవీ నరసింహారావు (PV Narasimha Rao) వర్ధంతి సందర్భంగా.. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని ‘పీవీ జ్ఞానభూమి’ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పీవీ సమాధి వద్ద గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్‌ (Revanth Reddy) శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ అని కొనియాడారు.

బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై పీవీ ఒకే మాట చెప్పారని... తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని ఆయన చెప్పారన్నారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని, పేదలకు భూములు పంచడానికి ఆయన బలమైన పునాదులు వేశారన్నారు. పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమన్నారు. పీవీ నరసింహారావు, జైపాల్ రెడ్డిలు తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని, పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పీవీ కీర్తిని పెంచాలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్‌ అన్నారు.

ఇక ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన పీవీ నరసింహారావు వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై నివాళులర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ నరసింహారావుకే సొంతమని చెప్పారు. విద్యావ్యవస్థ సహా అనేక సామాజిక మార్పులకు కృషి చేశారని, భూ సంస్కరణలు అమలు చేసిన వ్యక్తి పీవీ అని కొనియాడారు.




Tags:    

Similar News