మంత్రి హరీశ్ రావు కామెంట్స్ పై బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఆయన అహంకార మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్ధిపేట బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన రఘునందన్.. బీజేపీ నాయకులు ఒకట్రెండు సీట్లు గెలిస్తే ఏం పని చేస్తారని మాట్లాడటం హరీశ్ రావు అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో పార్లమెంటులో ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు.
2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం ప్రస్తుతం 300ల పై చిలుకు ఎంపీ సీట్లకు చేరుకుందని రఘునందన్ చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ 2 స్థానాల్లో గెలిస్తే, బీఆర్ఎస్ ఒక స్థానానికి పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. అహంకారపూరిత మాటలను తెలంగాణ సమాజం క్షమించదన్న రఘునందన్ అలాంటి మాటలు మాట్లాడే వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు.