BRS vs Congress: దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో.. రాహుల్ గాంధీ

Update: 2023-10-19 07:21 GMT

దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. అవినీతి కారణంగా ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్‌ అవినీతిపై ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్నించారు. రెండో రోజు విజయభేరి బస్సుయాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. భూపాలపల్లి జిల్లా కాటారంలో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్.. సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగిందన్నారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని పక్క రాష్ట్రాలకు విస్తరించిందన్నారు.

రోడ్ షో వచ్చిన జనాలనుద్దేశించి.. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి కచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధమైనట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీ ప్రభుత్వం చూస్తూ ఉంటుందే కానీ విచారణ చేపట్టదని అన్నారు. సీబీఐ, ఈడీ సైలెంట్‌గా ఉంటాయన్నారు. తనపై మాత్రం 24 కేసులు పెట్టారని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు . ఈ మూడు పార్టీలు కాంగ్రెస్‌ను టార్గెట్ చేశాయన్నారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ, బీజేపీకి బీఆర్‌ఎస్‌ సపోర్ట్ చేసుకుంటున్నాయన్నారు. పార్లమెంట్‌లో పెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. అవినీతి కారణంగానే పదేళ్లుగా కేసీఆర్ ప్రజలకు దూరమవుతూ వస్తున్నారని అన్నారు.

దేశంలో కుల గణన జరగాలని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ. దేశాన్ని నడిపిస్తున్న ఉన్నతాధికారుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది అని అడిగానని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అందుకే కుల గణన జరగాల్సిన అవసరాన్ని గుర్తించామన్నారు. దేశంలో ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్ ను నియంత్రిస్తున్నారని ఆయన చెప్పారు. అందరిని పాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. 90 మంది కీలక అధికారుల్లో ఎంతమంది బీసీలున్నారని తాను పార్లమెంట్ లో అడిగినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కులగణన చేయాలని ఆదేశించినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు.

Tags:    

Similar News