ఎన్నికల్లో పోటీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ..

Update: 2023-08-26 09:56 GMT

రాహుల్ సిప్లిగంజ్.. నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సింగర్. తన పాటలతో మస్త్ క్రేజ్ సంపాదించుకున్న ఈ తెలంగాణ పోరడు.. ఎన్నికల బరిలోకి దిగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ తరుపున గోషామహల్ నుంచి పోటీ చేస్తున్నాడని.. దరఖాస్తు సైతం చేశాడని వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై రాహుల్ క్లారిటీ ఇచ్చాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్నట్లు ప్రచారాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు.

తాను రాజకీయాల్లోకి రావట్లేదని రాహుల్ స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తానని పలు యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో వస్తున్న వార్తలు ఎలా వచ్చాయో తెలియదన్నాడు. ‘‘నేనొక కళాకారుడిని. ప్రజలను ఎంటర్‌టైన్ చేయడమే నాకు తెలుసు. దీనినే భవిష్యత్‌లోనూ కొనసాగిస్తా. ప్రస్తుతం నా దృష్టి మ్యూజిక్ కెరీర్ మీదే ఉంది. రాజకీయాలపై ఏ పార్టీ కూడా నన్ను సంప్రదించలేదు. నేను కూడా ఎవరిని అడగలేదు. దయచేసి ఇలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టండి’’ అని రాహుల్ విజ్ఞప్తి చేశాడు.

గోషామహల్ నియోజకవర్గం 2014, 2018 ఎన్నికల్లో నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టుల కారణంగా రాజాసింగ్పై వేటు వేసిన బీజేపీ ఇప్పటి వరకు ఆయన సస్పెన్షన్ తొలగించలేదు. దీంతో బీజేపీ ఈసారి ఆయనకు టికెట్ ఇస్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు 115 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పెండింగ్ లో పెట్టిన నాలుగు నియోజకవర్గాల్లో గోషామహల్ కూడా ఒకటి. దీంతో గోషామహల్పై అందరి దృష్టి నెలకొంది.

Tags:    

Similar News