తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నూతన చైర్పర్సన్ గా దివంగత సాయిచంద్ సతీమణి రజిని నేడు బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఉదయం నాంపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో... రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో నూతన చైర్పర్సన్ గా రజినీ సాయి చంద్ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం చేసిన సాయి చంద్ గుండెపోటుతో ఇటీవల మరణించడంతో, గిడ్డంగులసంస్థ చైర్ పర్సన్ గా ఉన్న భర్త స్థానంలో భార్య రజినీకి అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పట్ల పలువురు ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.ఉద్యమకారుల కుటుంబాలను ఆదరించడంలో సీఎం కేసీఆర్ గొప్ప ఔదార్యం చూపిస్తారని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సాయి చంద్ మరణంతో రజినీ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. భర్త మరణం ఆమె తీవ్రంగా కుంగదీసింది. గుండెపోటుతో హఠాత్తుగా మరణించిన సాయి చంద్ కు తగిన గౌరవం ఇవ్వటం కోసం ప్రభుత్వం ఆమెకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పోరేషన్ చైర్పర్సన్ గా సాయి చంద్ సతీమణి రజిని ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా పని చెయ్యాలని చాలామంది కోరుతున్నారు.