Rashtrapati Nilayam : వచ్చే వారం నుంచి రాష్ట్రపతి నిలయం సందర్శన నిలిపివేత

Byline :  Veerendra Prasad
Update: 2023-12-05 02:21 GMT

హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి కొద్ది రోజులపాటు సందర్శకులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. భారత రాష్ట్రపతి ప్రతి ఏడాది డిసెంబర్ మాసంలో ఈ నిలయంలో కొద్ది రోజుల పాటు సందర్శన ఉంటడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు, నిర్వహణ కోసం ఈ నెల 11 తేదీ నుంచి 25 వరకు సందర్శకులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. శీతాకాల విడిది పూర్తయ్యే వరకు ప్రజలెవరూ రావద్దని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనంతరం రాష్ట్రపతి కుటుంబసమేతంగా మొదటిసారిగా రాబోతున్నారు.

రాష్ట్రపతి దక్షిణ భారత దేశ పర్యటన సమయంలో మినహాయించి ఏడాది పొడవునా రాష్ట్రపతి నిలయాన్ని సాధారణ ప్రజలు సందర్శించవచ్చు. గతంలో ప్రజలకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరిమిత కాలం పాటు నిలయాన్ని సందర్శించేందుకు అనుమతి ఉండేది. కాగా గత ఏడాది ఉగాది నుంచి రాష్ట్రపతి విడిది చేసే డిసెంబర్ నెల మినహా అన్ని రోజుల్లోనూ సాధారణ ప్రజలను సందర్శన కోసం అనుమతినిచ్చారు. ప్రజలు వారానికి 6 రోజులు (సోమవారాలు , ప్రభుత్వ సెలవులు మినహా) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించవచ్చు. రాష్ట్రపతి భవన్‌ సందర్శించే భారతీయులకు ప్రతి వ్యక్తికి రూ. 50, విదేశీయులైతే రూ. 250గా ఎంట్రీ ఫీజు నిర్ణయించారు. రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించాలి అనుకునేవారు అధికారిక వెబ్​సైట్లో టికెట్​ బుక్​ చేసుకోవాలి.

బ్రిటీష్ కాలం(1805)లో బొల్లారంలో రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని అప్పట్లో వైశ్రాయ్​ అతిథి గృహంగా పిలిచేవారు. దీన్ని నిజాం పరిపాలనలో వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ నిలయాన్ని కేంద్ర ప్రభుత్వం 1950లో రూ.60 లక్షలకు కొనుగోలు చేసి, రాష్ట్రపతి నిలయంగా పేరు పట్టారు .. అందులో 20కి పైగా గదులుంటాయి. 75 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనం పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పూలు, పండ్ల తోటలు, ఉద్యానవనాలు, ఫౌంటెన్లు ఇలా ప్రతి ఒక్కటి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. భారత తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్ర ప్రసాద్‌ నుంచి ఇక్కడ శీతాకాల విడిది ఆనవాయితీ కొనసాగుతోంది. రాష్ట్రపతి నిలయంలోని 1.20 ఎకరాల్లో 27 నక్షత్రాలు, 9 గ్రహాల పేర్లతో వృత్తాకారంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వనం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.




Tags:    

Similar News