తెలంగాణ ఉద్యమంలో కెరటంలా ఎగసిపడి.. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగుల్లో ఉద్యమ భావాలు నింపి.. ప్రజాయుద్ధ నౌకగా పేరొందిన ప్రజా గాయకులు గద్దర్ (77) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న గద్దర్.. అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) మరణించారు. ఆయన మరణవార్త విని తెలుగు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ క్రమంలో అపోలో హాస్పిటల్ యాజమాన్యం ఆయన మృతిపై బులిటెన్ ను విడుదల చేసింది. రెండు రోజుల కిందటే గద్దర్ కు గుండె ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఇవాళ ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దాంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందించినా లాభం లేకపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఊపిరితిత్తులు, మూత్రాశయ సంబంధిత సమస్యలు తలెత్తి.. మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూశారు.