Praja Bhavan: ప్రజాభవన్‌ ముందు అర్ధరాత్రి కారు బీభత్సం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-26 03:38 GMT

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజా భవన్ (ప్రగతి భవన్) ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 23న అర్ధరాత్రి దాటాక 2.45 గంటల సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కారు(TS13 ET0777) ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైనా అందులోని వారికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రజా భవన్ వద్ద సెక్యూరిటీగా వున్న పోలీసుల ఎదుటే కారు బారికేడ్లను ఢీకొట్టింది. కారులో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు వున్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే కారు ప్రమాదం జరగ్గానే ఓ యువకుడు పరారవగా మరొకరిని పోలీసులు పట్టుకున్నారు. అతడికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించలేదని తేలింది.

ఈ ప్రమాదంపై ట్రాఫిక్‌ పోలీసుల ఫిర్యాదుతో.. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ అబ్దుల్ ఆసిఫ్(27) ను విచారించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. అలాగే ప్రమాదంలో ధ్వంసమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నెంబర్ ఆధారంగా వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రమాద సమయంలో బోధన్‌కు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ,బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడితో పోలీసులను మేనేజ్ చేసిన షకీల్ కొడుకును కేసునుండి తప్పించి మరొకరి పేరు చేర్చినట్టు సమాచారం. పంజాగుట్ట పోలీసులు మాత్రం.. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని వైద్యపరీక్షల నిమిత్తం ట్రాఫిక్‌ పోలీసులకు అప్పగించినట్టు చెబుతున్నారు. వాస్తవాలు ఏమిటనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వమని.. నగర సీపీ శ్రీనివాస్‌రెడ్డి పంజాగుట్ట పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది.

Tags:    

Similar News