కాంగ్రెస్ రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తోంది - హరీశ్ రావు

By :  Kiran
Update: 2023-11-12 09:48 GMT

కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. కరెంటు విషయంలో ఆ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆరోపించారు. ములుగు జిల్లాకు చెందిన పలుపురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తుంటే కర్నాటకలో 5 గంటల ఇస్తున్నామని డీకే శివకుమార్‌ గొప్పగా చెప్పుకుంటున్నాడని సటైర్ వేశారు. కాంగ్రెస్‌ హయాంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లే దర్శనమిచ్చేవని గుర్తుచేశారు. ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని మంత్రి విమర్శించారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని సటైర్ వేశారు. అందుకే కరెంటు, రైతు బంధు, ధరణి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్కు పనితనమే తప్ప పగతనం తెలియదని హరీశ్ రావు చెప్పారు. కేసీఆర్‌ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా అన్న ఆయన.. బీఆర్ఎస్ పాలనలో కరువు కాటకాలు లేవని గుర్తు చేశారు. పల్లెల్లో సాగునీటికి, హైదరాబాద్‌లో తాగు నీటికి ఇబ్బంది లేకుండా పోయిందని, కేసీఆర్‌ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించడంతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయని అన్నారు. ములుగు జిల్లా ప్రజలపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు.

కమలాపూర్‌ ఫ్యాక్టరీని తెరిపించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేశారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ ఫ్యాక్టరీతో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ములుగు ప్రజలపై అభిమానంతోనే కేసీఆర్‌ ములుగు జిల్లాను ఏర్పాటు చేశారని హరీశ్ రావు స్పష్టం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ నాగజ్యోతిని, గెలిపిస్తే జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Tags:    

Similar News