తెలంగాణ సెంటిమెంట్‎తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు :రేవంత్ రెడ్డి

Update: 2023-06-21 11:15 GMT

తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే కాంగ్రెస్ పార్టీలో చేరికలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‎తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరిస్తామని చెప్పారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ కేసీఆర్ అధికారానికి చివరి రోజు అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మాజీ ఎంపీ పొంగులేటితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డితో పాటు పలవురు నేతలతో కలిసి పొంగులేటి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటితో చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ "నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించిన జయశంకర్ సార్ వర్థంతి. వారి స్పూర్తితో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఆయన సిద్ధాంతాలకు ఆకర్శితులై ఉద్యమంలో అందరూ కలిసి వచ్చారు. వారి స్పూర్తితో విద్యార్థులు ఉద్యమంలో ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ప్రయోజనం చేకూరలేదు. ఆనాడు తెలంగాణతో కేసీఆర్‎కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు. తెలంగాణ సెంటిమెంట్‎తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కాంగ్రెస్‎కు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉంది. హరగోపాల్, విమలక్క , ఉద్యమకారులపై ఉపా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. విమలక్కపై పెట్టిన ఉపా కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి" అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


Tags:    

Similar News