కేసీఆర్.. నల్గొండ దగ్గరా? అసెంబ్లీ దగ్గరా? కాలు విరిగిందని కుంటిసాకులు ఇంకెన్నాళ్లు

Byline :  Bharath
Update: 2024-02-13 13:44 GMT

ప్రజల ముందు అవినీతి పరుడిగా, దోషిగా, దోపిడీ దారుడిగా నిలబడాల్సి వస్తుందని వ్యూహాత్మకంగా కేసీఆర్ కృష్ణా జలాల వివాదం తెరపైకి తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని కాంగ్రెస్ మీద ఎదురుదాడికి దిగుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చానని కేసీఆర్ మరో అబద్దానికి పునాది వేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిజంగా సత్య హరిచంద్రుడే అయితే.. అసెంబ్లీలో చర్చలు పెట్టినప్పుడు ఎందుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా నది జలాల స్వాధీనానికి చేస్తున్న ఎత్తుగడను అడ్డుకునేందుకు రమ్మని పిలుపునిస్తే రాకుండా.. తిరిగి కాంగ్రెస్, బీజేపీ ఒకటయ్యాయని అనడం ఏంటని నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కప్పిబుచ్చే ప్రయత్నం చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఆధారాలతో శాసన సభలో బయటబెట్టింది. ఈ ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించుకునేందుకు ప్రాజెక్టు వద్దకు రావాలని కాంగ్రెస్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీని వెళ్దామని పిలుపునిచ్చాం. ఈ రోజున బీఆర్ఎస్ నేతలకు రావడం వీలు కాకపోతే.. వేరొక తేదీని నిర్ణయించాలని కోరాం. అయినా వారు పట్టించుకోలదేని రేవంత్ ఆరోపించారు.

కేసీఆర్ శాసనసభలో చర్చకు, ప్రాజెక్టు విజిటింగ్ కు రాకుండా.. కాలువిరిగిందని సాకు చెప్పారని రేవంత్ మండిపడ్డారు. అయితే నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకు ఎలా వెళ్లారని నిలదీశారు. కాలు విరిగిందనే సాకు చెప్తూ.. కేసీఆర్ ఇంకా సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ప్రతీ విషయంపై అవగాహన ఉంది. అన్నీ చూస్తున్నారు. భవిష్యత్తులో అన్నింటికి బదులు తీర్చుకుంటారని అన్నారు. కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సున్నమైపోయాయని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం, మేడిగడ్డకు రాకుండా కేసీఆర్ చేసింది ఒక తప్పైతే.. ఇక్కడ జరిగిన విషయాన్ని తక్కువ చేసి మాట్లాడటం మరో తప్పని రేవంత్ అన్నారు.

Tags:    

Similar News