రాహుల్ వ్యాఖ్యలతో వారికి చమట్లు పడుతున్నాయ్ : రేవంత్

Update: 2023-07-03 15:36 GMT

కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ సర్కార్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఖమ్మం సభలో రాహుల్ అన్నారు. అయితే ప్రాజెక్టు విలవే 80వేల కోట్లు అయితే లక్ష కోట్ల అవినీతి ఎక్కడిదని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ కౌంటర్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన నివేదికపై చర్చకు కేటీఆర్, హరీష్ రావు సిద్ధమా అని సవాల్ విసిరారు. చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.

రాహుల్ గాంధీ ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పును చూపితే ఏ శిక్షకైన సిద్ధమన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో తమ అవినీతి బయట పడిందని కేటీఆర్, హరీష్ రావులు ఆందోళన పడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా 2001లో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన నాటి నుండి నిన్నటివరకు ఆ పార్టీ ఆస్తులు ఎంత పెరిగాయో కూడా చర్చిద్దామన్నారు.

రాహుల్ కుటుంబం దేశం కోసం ప్రాణాలర్పించిందని రేవంత్ గుర్తుచేశారు. అలాంటి వ్యక్తికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడాన్ని రేవంత్ తప్పుబట్టారు. పదేళ్లకు కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడ రాహుల్ గాంధీ పదవి తీసుకోలేదని రేవంత్ అన్నారు. రాహుల్ గాంధీకి కాకుండా తెలంగాణలో పర్యటించే అర్హత ఎవరికి ఉందని ఆయన ప్రశ్నించారు.

త్యాగాలకు గాంధీ కుటుంబం పేరు పొందితే.. అవినీతికి కల్వకుంట్ల కుటుంబం పేరు పొందిందని రేవంత్ విమర్శించారు. దేశం కోసం గాంధీ కుటుంబం ప్రధానమంత్రి పదవిని కూడ వదులుకుందని అన్నారు. పదవులను, ప్రాణాలను త్యాగం చేయడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిన కుటుంబమని స్పష్టం చేశారు. ఉపాధిహామీ చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని రేవంత్‌ అన్నారు. ఆర్టీఐ, ఆహార భద్రత చట్టంతోపాటు హైదరాబాద్‌లో ఐటీ సంస్థలు, ఓఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్టు, ఫార్మా సంస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్సేనని గుర్తుచేశారు.

Tags:    

Similar News