Bhatti Vikramarka : ఎన్నికల ముందు ప్రకటించిన డిక్లరేషన్లన్నీ అమలు చేస్తాం - భట్టి విక్రమార్క

Byline :  Kiran
Update: 2024-02-10 07:39 GMT

ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆరింటిలో రెండు హామీలను అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రారంభించి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 53,196 కోట్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఈ పథకాల లబ్ది కోసం 1.29కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వాటిని క్రోడీకరించే పని పూర్తైందని భట్టి స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే మరో రెండు స్కీంలను ప్రారంభించనున్నట్లు చెప్పారు.

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం అవసరమైన నిధులు అందిస్తున్నట్లు భట్టి చెప్పారు. ఇప్పటికే నెలకు రూ.300 కోట్ల చొప్పున అదనపు నిధులు మంజూరు చేశామని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిచిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గత బకాయిలను సైతం విడుదల చేసి ఆరోగ్య శ్రీకి ఎలాంటి అడ్డంకి లేకుండా అవసరమైన నిధులు చెల్లిస్తున్నట్లు చెప్పారు.

గృహజ్యోతి పథకం కింద అర్హులైన వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేసేందుకు లబ్దిదారుల ఎంపిక సైతం జరుగుతోందని అన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం హామీల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని భట్టి ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని గ్యారెంటీల అమలుకు సంబంధించి విధి విధానాలు రూపొందించే పని ఇంకా కొనసాగుతున్నందున అది పూర్తైన వెంటనే అమలుకు అవసరమైన పూర్తి నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్ లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో చెప్పిన ఎస్సీ - ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ, మైనార్టీ డిక్లరేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని భట్టి స్పష్టం చేశారు.




Tags:    

Similar News