రైతుబంధుకు బ్రేక్.. ఈసీ ఆదేశాలపై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
రైతుబంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం (EC) కాసేపటి క్రితం ఉపసంహరించుకోగా... ఈ విషయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియజేశారు. 'రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. మిగతా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశం మామా-అల్లుళ్లకు లేదు. హరీశ్ వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్లు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15వేలు రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం' అని ట్వీట్ చేశారు
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు (Rythu Bandhu) పంపిణీకి గత శుక్రవారం (నవంబర్ 24న) ఈసీ అనుమతించింది. ఈ నెల 28వ తేదీలోపు పంట సాయాన్ని అందించాలని పేర్కొంది. దీంతో సమయానికి పంటసాయం అందుతుందని రైతులంతా ఎదురుస్తున్న వేళ.. అనుమతులను ఉపసంహరించుకుంటూ సోమవారం ఉదయం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమాలను ఉల్లంఘించారంటూ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని... లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే ఈసీ షరతు విధించింది. అయితే రైతుబంధుపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ ఈసీ ‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది
ఏటా ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్‌లకు మొత్తం రూ.10 వేలను వారి అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. మరోసారి ప్రభుత్వం ఏర్పాటయితే రైతుబంధును రూ. 16 వేలకు పెంచుతామని గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించగా, కాంగ్రెస్ సైతం తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో తమ హామీగా పేర్కొంది.