మహిళ ప్రాణాలను కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్

Update: 2023-06-11 07:40 GMT

ఇటీవల రైల్వే స్టేషన్లలో ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. రైలు ఎక్కేటపుడు.. దిగేటపుడు పట్టు కోల్పోయి చాలా మంది ఫ్లాట్ ఫామ్ మద్యలో పడిపోతూ తీవ్ర గాయాలపాలవుతున్నారు.. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రైలు కదిలే సమయంలో దూరంగా ఉండాలని రైల్వే అధికారులు ఎన్నిసార్లు చెప్పినా.. పదే పదే అదే తప్పు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ప్రయాణికులు. కొన్ని రోజుల క్రితం బేగంపేట రైల్వే స్టేషన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఎక్కబోయి ఓ మహిళ పట్టు కోల్పోగా.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ వెంటనే స్పందించి.. ఆమె ప్రాణాలు కాపాడారు. తాజాగా వరంగల్ రైల్వే స్టేషన్ లో కూడా అచ్చం అలాగే ఓ మహిళ కదిలే రైలు దిగుతున్న సమయంలో పట్టు కోల్పోయి.. ఫ్లాట్ ఫామ్ లో ఇరుక్కుపోయింది. వెంటనే మహిళా కానిస్టేబుల్ వచ్చి ఆమెను రక్షించింది. వివరాల్లోకి వెళితే..

వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలునుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు రైలు కిందపడుతుండగా, ఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ చాకచక్యంగా కాపాడారు. భద్రాచలం రోడ్డు నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలు నంబరు 12746 మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ శనివారం తెల్లవారుజామున 2.47 గంటలకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. నెమ్మదిగా ఆగుతున్న సమయంలో ఓ మహిళా ప్రయాణికురాలు దిగేందుకు ప్రయత్నించారు. పట్టు జారడంతో ప్లాట్‌ఫాం మీద పడిపోయారు. ఆమె తలుపు వద్ద హ్యాండిల్‌ను వదలక పోవటంతో కొద్ది దూరం ఈడ్చుకొని వెళ్లింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న రైల్వే రక్షక దళం మహిళా కానిస్టేబుల్‌ సొనాలి ఎం.మొలాకె పరుగున వచ్చి ప్రయాణికురాలిని ఒక్క ఉదుటున ప్లాట్‌ఫాం వైపు లాగారు. దీంతో ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది. కానిస్టేబుల్‌ చూడకుంటే ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్య పడి ప్రాణాలు కోల్పోయేది. విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సొనాలిని రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.

Tags:    

Similar News