బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఏ ఫంక్షన్ అయినా, చుట్టాలు ఇంటికి వచ్చినా, వీకెండ్ అయినా సరే బిర్యానీ కంపల్సరీ ఉండాల్సిందే. లేదంటే ఏదో లోటుగా ఫీల్ అవుతుంటారు చాలా మంది బిర్యానీ లవర్స్. నోటికి రుచి అనిపించిన, నచ్చిన బిర్యానీ తినేందుకు ఎక్డివరకైన పోదామంటారు. ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ అయిపోతారు. అలాంటిది కేవలం ఒకే ఒక్క రూపాయికే ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ తొరుకుతుందంటే వదిలిపెడతారా చెప్పండి. ఉన్నపళంగా అక్కడ వాలిపోవాల్సిందే. అదే సీన్ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో జరిగింది. కొత్తగా తన ఔట్‌లెట్‌ను ప్రారంభించిన ఓ హోటల్ యజమాని ఈ ఆఫర్ ప్రకటించాడు. రూపాయికే బిర్యానీ అనేసరికి భోజన ప్రియులు బిర్యానీ సెంటర్‌కు పరుగులు పెట్టారు. ఎండను సైతం లెక్క చేయకుండా రెస్టారెంట్ ముందు బారులు తీరారు. ఇక్కడి వరకు ఓకే కానీ, ఆ తరువాతే అసలు ట్విస్ట్ ఎదురైంది.
కరీంనగర్‌లోని తెలంగాణచౌక్ సమీపంలో ఓ బిర్యానీ సెంటర్ కొత్తగా ప్రారంభమైంది. కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో రూపాయి నోటు ఇచ్చిన కస్టమర్లకు చికెన్ బిర్యానీ ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పోస్టర్లను కూడా అతికించారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది. దీంతో శుక్రవారం రెస్టారెంట్ ముందు పెద్ద సంఖ్యలో జనం రూపాయి బిర్యానీ కోసం ఎగబడ్డారు. అరగంటలోనే ఏకంగా 800లకు పైగా బిర్యానీలు సేల్ అయ్యాయి. చాలా మందికి బిర్యానీ లభించకపోవడంతో హోటల్ ముందే ఆందోళనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు బిర్యానీ సెంటర్‌ను మూయించడంతో పాటు రోడ్లమీద ఇష్టం వచ్చినట్లు బండ్లను పార్క్ చేసిన వారి వాహనాలను రూ.235 వరకు ఫైన్ వేశారు. దీంతో రూపాయి బిర్యానీ కోసం ఆశ పడితే రూ.200 జేబుకు చిల్లు పడిందని నిరాశపడుతున్నారు.