srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త..
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. భక్తులకు స్పెషల్ టూర్ ప్యాకెజీని కల్పించింది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునేవారికి..శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది. దీంతో రోజూ 1,200 దర్శన టికెట్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 200 స్పర్శ దర్శనం, 500 అతి శీఘ్రదర్శనం, మరో 500 శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయి. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం, ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయం త్వరలోనే అమలు కానున్నట్లు తెలుస్తోంది. స్పర్శదర్శనం టికెట్ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.150 ఉంటుందని ఆర్టీసీ తెలిపింది.
అయితే హైదరాబాద్ టూ శ్రీశైలం ఏసీ బస్సులు వారం రోజుల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఛార్జీలుపెద్దలకు జేబీఎస్ నుంచి రూ.750, పిల్లలకు రూ.540. ఎంజీబీఎస్ నుంచి రూ.700, రూ.510గా ఆర్టీసీ ఖరారు చేసింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు ప్రతి 50 నిమిషాలకు ఒక ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్‌లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్‌ఎం శ్రీధర్ తెలిపారు.