Bhatti Vikramarka : వారికి మాత్రమే రైతుబంధు.. మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన

Byline :  Shabarish
Update: 2024-03-09 11:47 GMT

రైతుబంధుకు సంబంధించి మంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కొండలు, గుట్టలు, రోడ్లకు తమ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శనివారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రైతుబంధును పాత డేటా ప్రకారమే ఇస్తున్నట్లు తెలిపారు. 4 ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రమే రైతుబంధు అందుతోందన్నారు. త్వరలోనే 5 ఎకరాలలోపు ఉన్నవారికి రైతుబంధును ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

వ్యవసాయం చేసేవారికి మాత్రమే రైతుబంధు ఇస్తామని, వ్యవసాయ పంపులకు మీటర్లు పెట్టేది లేదని భట్టి విక్కమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. 11వ తేదిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 12న ఇందిరా క్రాంతి పేరుతో మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చే పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు.

ఇకపోతే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని భట్టి హామీ ఇచ్చారు. ఏప్రిల్, మే నెలల్లో 16వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే విద్యుత్ పాలసీని తీసుకొస్తున్నట్లు తెలిపారు. సోలార్ విద్యుత్‌ను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్ అందిస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ 40,33,702 జీరో బిల్లులు అందించినట్లు స్పష్టం చేశారు.


Tags:    

Similar News