Govt Emp Salaries: వరుసగా రెండో నెలలో.. జీతాలు అందడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఖుష్
తెలంగాణలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి వేతనాలను(Monthly Salaries) అందిస్తోంది. డిసెంబర్ 7 న అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్.. ఆ తర్వాతి నెల జనవరి ఫస్టు తారీఖునే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలను జమ చేసింది. న్యూ ఇయర్ వేళ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో శాలరీలు పడడంతో వారు చాలా సంబరపడిపోయారు. చాలాకాలం తర్వాత సకాలంలో జీతాలు పడ్డాయని సంతోషపడ్డారు. ఇక రెండో నెల ఫిబ్రవరిలో కూడా ఈరోజు(ఫిబ్రవరి 1, 2024)న కొన్ని డిపార్టుమెంట్ల, జిల్లాల్లోని ఉద్యోగులకు జీతాలు పడ్డట్లు ఉన్నతాధికారుల నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఠంఛన్‌గా ఫస్ట్ తారీఖునే జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ మధ్యలో పడుతుండడంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చితి నెలకొన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందకపోవడం వల్లే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని సీఎం పలుమార్లు ఉన్నతాధికారులకు వివరించారు. ఆ తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగకూడదని ఆదేశించడంతోనే.. ఈ నెల కూడా ఒకటో తేదీనే జీతాలు పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఫస్టు తారీఖునే జీతాలు అందించామని సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) అయోధ్యరెడ్డి తెలిపారు.