బోర్డు తిప్పేసిన సమతా మూర్తి చిట్ ఫండ్స్.. రోడ్డున పడ్డ కస్టమర్లు
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం బయటపడింది. చిట్టీల పేరుతో ఓ వ్యక్తి కస్టమర్లను నిలువు దోపిడీ చేశారు. కడుపు కట్టుకుని రూపాయి రూపాయి పొదుపు చేసుకున్న వారికి కుచ్చుటోపీ పొట్టారు. హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ చిట్ ఫండ్ కంపెనీ.. దాదాపు రూ. 200 కోట్లు మేర కస్టమర్లను మోసం చేయడం హాట్ టాపిక్గా మారింది.
శ్రీనివాస్, రాకేష్, గణేష్, జ్యోతి అనే వ్యక్తుల మాదాపూర్ కేంద్రంగా సమతామూర్తి చిట్ ఫండ్స్ ప్రారంభించారు. ఎల్బీనగర్, కూకట్ పల్లిల్లోనూ బ్రాంచీలు ప్రారంభించారు. వారి మాటలు నమ్మిన చాలా వందల మంది కస్టమర్లుగా చేరారు. తమ కష్టార్జితాన్ని పొదుపు చేసుకునేందుకు వివిధ రకాల చిట్ ఫండ్ ప్లాన్స్ లో చేరారు. ఇలా ఒక్కొక్కరి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన చిట్ ఫండ్స్ నిర్వాహకులు ఏకంగా రూ.200 కోట్లు తీసుకుని చివరికి బోర్డు తెప్పేశారు.
విషయం తెలుసుకున్న బాధితులు సమతా మూర్తి చిట్ ఫండ్స్ నిర్వాహకులపై రెండు నెలల క్రితం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు..అయితే రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో చివరకు వారంతా సైబరాబాద్ సీపీని కలిశారు.
సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో శ్రీనివాస్, రాకేష్లను అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ డైరెక్టర్ గణేష్, అకౌంటెంట్ జ్యోతి పరారీలో ఉన్నారు. సంస్థ నిర్వాహకులు చిన్న జీయర్ స్వామి పేరు, ఫోటోలు వాడి తమను మోసం చేశారని బాధితులు వాపోయారు. రూ. లక్ష మొదలు కోటి రూపాయల వరకు చిట్టి వేసామని లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన డబ్బులు ఇప్పించి, న్యాయం చేయాలని కోరుతున్నారు.