హైదరాబాద్ జూలో ‘పుష్ప’ స్మగ్లింగ్.. గుట్టుచప్పుడు కాకుండా లేపేశారు
వీరప్పన్ చేసిన పనులు చేయడానికి బుర్ర మీసాలు, చేతిలో తుపాకీ, ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ అక్కర్లేదు. కాలం కలిసొస్తే దర్జాగా అతని చేసిన పనులన్నీ చేయొచ్చు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్కులో జరిగిన ఉదంతమే దీనికి ఉదాహరణ. పార్కులో విలువైన మంచిగంధపు చెట్లను దొంగలు చక్కగా కొట్టుకుని పోయారు. కొన్ని దుంగలను తర్వాత తీసుకెళ్దామని అక్కడే పేర్చాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది అవాక్కవుతున్నారు. జూలో దొంగిలించడానికి జంతువులు మాత్రమే కాదు, మరికొన్ని కూడా ఉన్నాయని ఈ ఉదంతం బయటపెట్టింది.
జూలోని ప్రతి ప్రాంతంలో సిబ్బంది నిఖా పెట్టలేకపోవడంతో దొంగలు చెట్లను టార్గెట్ చేసుకున్నారు. ఏడు చెట్లను నరికినట్లు ఈ నెల 20న సిబ్బంది గుర్తించారు. అయితే ఈ రాకెట్ చాలా రోజులనుంచే సాగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత పకడ్బందీగా ఉండే జూలో ‘పుష్ప’ సినిమాలో మాదిరి గంధపు చెట్లను కొట్టడం ఈజీ కాదని, కొట్టినా బయటికి తరలించడం కష్టమని చెబుతున్నారు. దొంగలకు సిబ్బంది సహకరించారా లేకపోతే, ఇంటిదొంగల పనా అని అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్కులో ఇదివరకు కూడా గంధపు చెట్లును కొట్టి ఎత్తుకెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. తాజా స్మగ్లింగ్ పై సిబ్బంది బహదూర్ పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.