sankranthi Celebrations: రాష్ట్రవ్యాప్తంగా మొదలైన సంక్రాంతి సంబరాలు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-14 02:12 GMT

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. దూరప్రాంతాల్లో ఉన్నవారు సైతం సొంతూళ్లకు చేరుకోవడంతో, పల్లెల్లో పండుగ వాతావరణం ఉట్టిపడుతోంది. ఎటు చూసినా రంగురంగుల ముత్యాల ముగ్గులే దర్శనమిస్తున్నాయి. లోగిళ్లు బంధువులతో కళకళలాడుతున్నాయి. కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రప్రజలకు పలువురు ప్రముఖులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి పెద్ద పండుగ. తెలుగు పంచాంగం ప్రకారం, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది.ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. మూడు రోజుల ఈ పండుగలో మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ జరుపుకుంటారు. మొదటి రోజైన భోగి నాడు మనలోని చెడు గుణాలను తొలగించుకొని పవిత్రమైన జీవితం గడపాలనే నేపథ్యంలో అందరూ భోగి మంటలు వేస్తారు. తెల్లవారు జామునే ఇళ్లలో ఉన్న పాత వస్తువులను కుప్పగా పోసి భోగిమంటలు వేస్తారు. పాత అలవాట్లకు స్వస్తి పలికి కొత్త దనాన్ని , కొత్త ఆలోచనలు కోరుకొంటూ భోగితో సంక్రాంతిని స్వాగతిస్తారు. ప్రతీ ఇంటి ముందు భోగిమంటలు వేసి సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. నేడు పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా అపార్ట్‌మెంట్ ఆవరణల్లో బోగి మంటలు వేస్తున్నారు. ఆడపడచులు రంగవల్లికలు వేసి అందులో గొబ్బెమ్మలను పూజిస్తు్న్నారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ భోగి మంటలతో కాగిన నీళ్లతో స్నానం చేస్తారు. ఈ స్నానాలతో దుష్టశక్తులు తొలగిపోయి సంతోషంగా ఉంటారని భావిస్తారు.

భోగి పండ్లు అంటే రేగు పండ్లు. సూర్యుడి రూపం రంగు పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలు కలిపి పిల్లల నెత్తిపై పోసి ఆశీర్వదిస్తారు. పిల్లలు కూడా ఎంతో సంబరంగా వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం వేళ మహిళలు బొమ్మల కొలువులు నిర్వహిస్తారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా బొమ్మల కొలువులు ఉంటాయి. ప్రజలంతా ఈ మూడు రోజులు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు.

Tags:    

Similar News