వాచ్‌మెన్‌తో సర్పంచ్ కూతురి ప్రేమ వివాహం.. ఘాతుకానికి పాల్పడ్డ తండ్రి

Update: 2023-07-05 07:55 GMT

తన కూతురు తనకు తెలియకుండా వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడా ఓ తండ్రి. కోపంతో ఆ యువకుడి ఇంటితో పాటు అతడికి సహకరించిన స్నేహితుల ఇళ్లను కూడా తగులబెట్టాడు. ఈ పైశాచిక ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. నర్సంపేట మండలం ఇటికాలపల్లి గ్రామ సర్పంచ్ మండల రవీందర్ కూతురు కావ్య శ్రీ.. హసన్‌పర్తి పరిధిలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. ఆమె అదే గ్రామానికి చెందిన జలగం రంజిత్ అనే యువకుడితో ప్రేమలో పడింది. నర్సంపేట పట్టణంలోని సర్వాపురం ఎస్బీఐ బ్యాంక్ ఏటీఎం దగ్గర నైట్ వాచ్ మెన్‌గా పని చేస్తున్న రంజిత్... కావ్య శ్రీ తో 5 రోజుల కిందట గ్రామం నుండి వెళ్లిపోయారు.




 


గ్రామానికి చెందిన పలువురు స్నేహితుల సాయంతో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తిని కూతురు పెళ్లి చేసుకుందనే సమాచారం తెలుసుకున్న ఆమె తండ్రి రవీందర్ కోపంతో రగిలిపోయాడు. దీనిపై హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురును ప్రేమ పేరుతో లోబర్చుకుని వివాహం చేసుకున్నాడని రంజిత్‌పై కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. కావ్య, రంజిత్‌లను స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా రంజిత్‌ను వదిలేసి తనతో రావాలని కూతురిని తండ్రి బ్రతిమిలాడాడు. అయినా తనతో వచ్చేందుకు కూతురు నిరాకరించడంతో రంజిత్‌పై మరింత పగ పెంచుకున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఆగ్రహంతో తన గ్రామానికి తిరిగొచ్చిన రవీందర్.. రంజిత్ ఇంటితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరి స్నేహితుల ఇళ్లను పూర్తిగా దగ్ధం చేశాడు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు.

గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇళ్లు పూర్తిగా మంటలకు దగ్ధం కావడంతో బాధితులు నిరాశ్రయులుగా మారారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్కశంగా ప్రవర్తించిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని బాధితులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


 

 

Tags:    

Similar News