SBI ఒప్పందం... హైటెక్‌ సిటీ, బేగంపేట మెట్రో స్టేషన్ల పేర్లు మార్పు

Update: 2023-06-06 02:17 GMT

మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి.. ఆ రైళ్లలో పలు రకాల సంస్థలకు సంబంధించిన ప్రకటనలు కనిపించే ఉంటాయి. సదరు సంస్థలు తమ ప్రొడక్ట్స్ జనాల్లోకి వెళ్లాలని.. మార్కెటింగ్ ప్రమోషన్స్‌ కోసం ఇలా చేస్తుంటాయి. మెట్రోతో ఒప్పందం కుదుర్చకుని ఇలా ప్రకటనలు వేస్తుంటాయి. తాజాగా ఓ ప్రభుత్వ రంగ సంస్థ.. ఏకంగా మెట్రోస్టేషన్ల పేర్ల ముందే తమ సంస్థ పేరు ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో ఆ స్టేషన్ల పేర్లు స్వల్పంగా మారబోతున్నాయి.



ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఆశించిన మేర ఆదాయం రావడం లేదని టాక్. ఇందుకోసమే మెట్రో అధికారులు.. సంస్థ లాభాల బాట పట్టేందుకు ప్రయాణికుల కోసం వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటుంది. ఈ క్రమంలోనే మెట్రో రైలు యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రోతో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకొంది. ఇందులో భాగంగానే మాదాపుర్‌లోని హైటెక్‌సిటీ, బేగంపేట మెట్రోస్టేషన్ల పేర్లు, బ్రాండింగ్ హక్కులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. దీని ప్రకారం హైటెక్‌సిటీ, బేగంపేట పేర్ల ముందు ఎస్‌బీఐ పేరు చేర్చారు.



ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేశ్‌ కుమార్ ఖారా హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రత్యేకతను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఇందులో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడి స్టేషన్‌లో ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్లు దినేశ్‌ కుమార్ ఖారా తెలిపారు. ఈ క్రమంలోనే హైటెక్ సిటీ మెట్రోస్టేషన్‌లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరికరాన్ని ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.




 





Tags:    

Similar News