బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే 67 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తిచేశారు. ఇవాళ మొత్తం 4 నియోజకవర్గాల్లో సీఎం పాల్గొంటారు. ఆయన షెడ్యూల్ లో రెండో విడత సభల్లో భాగంగా నిర్మల్ లోని ఖానాపూర్, కరీంనగర్ లోని వేములవాడ, జగిత్యాల, సిద్ధిపేటలోని దుబ్బాక నియోజకవర్గాల్లో పాల్గొగనున్నారు. ముందు ఖానాపూర్ లో సభలో పాల్గొన్న అనంతరం.. జగిత్యాల, వేములవాడ, దుబ్బాకకు చేరుకుంటారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఖానాపూర్ చేరుకుని భారీ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిస్తారు. పార్టీ నేతలు ఈ సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాల చేరుకుంటారు. అనంతరం వేములవాడ సభలో పాల్గొంటారు. దుబ్బాక సభతో ముగింపు పలుకుతారు. కాగా ఇవాళ ప్రధాని మోదీ కూడా నిర్మల్ లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొంటారు. ఈ రెండు సభలు జరుగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హెలిప్యాడ్‌లను అధికారులు సిద్ధం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.